వారపు ఆధ్యాత్మికత: పరిశుద్దాత్మ వలన శక్తిని పొందుట, లేఖనములో వేరు పారుట.
ధ్యానాంశం : న్యాయాధిపతుల గ్రంథం 15:14-15.
- అతడు లేహీకి వచ్చువరకు,ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కోని కేకలు వేయగా,యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె నాయెను; సంకెళ్లును అతని చేతుల మీద నుండి విడిపోయెను.
- అతడు గాడిద యొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యిమంది మనుష్యులను చంపెను.
క్రీస్తు నందు ప్రియ సహోదరీ మరియు సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్థ నామములో శుభములు. ఈ రోజు, దేవుని లో మన నడవడికను మనలో చాలామందిని నిశ్శబ్దంగా సవాలు చేసే ఒక ప్రశ్న గురించి మనం కాసేపు ఆగి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను: మనము నిజముగా లేఖనముల యెక్క స్థిర పునాదిపై మన జీవితాలను కట్టుకుంటున్నామా లేక మన అనుభవాలతో మరియు భావోద్వేగాలతో దేవుని వాఖ్యమును మరుగు పరుస్తున్నామా?
ఈ సమయములో సమ్సోను గూర్చి ఆలోచించండి.ప్రభువు ఆత్మ అతని మీదకు బలంగా వచ్చినప్పుడు, ఆయన అద్భుతమైన రీతిలో శక్తిని పొందాడని బైబిల్ మనకు చెబుతుంది. ఒక చచ్చిన గాడిద దవడ ఎముకతోనే ఆయన వెయ్యి మంది శత్రువులను ఓడించాడు. అది నిజంగా అద్భుతం! అయినప్పటికీ, సంసోను కూడా తన పతనానికి దారితీసే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు.ఆయన తప్పుడు స్నేహితులను ఎంచుకున్నాడు, క్షణికమైన సుఖాల వెనుక పడ్డాడు మరియు దేవుని దగ్గర నుండి ఆయనను దూరపరచేటటువంటి లోకపు ఆచారాలలో కలిసిపోయాడు. చివరికి, తప్పుడు ప్రభావాలు తన హృదయాన్ని ఏలేలా అనుమతించినందున, ఆయన తన కళ్ళను మరియు తన శక్తిని కోల్పోయాడు.
ఇది ఒక శక్తివంతమైన హెచ్చరిక కదా? మనము పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందినప్పటికీ, మనం తీసుకునే నిర్ణయాలే—మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, దేనికి లోబడుతున్నాము, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేవే—మనం నిజమైన విజయంలో నడుస్తామో లేదా పడిపోతామో అని నిర్ణయిస్తాయి. రాజైన సౌలు కూడా దీనిని అనుభవించాడు. దేవుని ఆత్మ అతనితో ఉన్నప్పటికీ, అతని వ్యాపకాలు, అసహనం మరియు అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు దేవునితో అతనికున్న సహవాసాన్ని నాశనం చేశాయి.
అశ్లీలత, మద్యం, పొగాకు, ద్వేషం మరియు దేవుని నుండి రాని మరేదైనా మన ఆత్మీయ ఎదుగుదలను నాశనం చేస్తాయి. అంతేకాకుండా, మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ లోక సంబంధమైన సుఖాలలో మునిగిపోతే, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ, మనకి నిరీక్షణ ఉంది. యోబు వలె, మనం కూడా దేవునితో ఒక నిబంధన చేసుకోవచ్చు—ఆయనను గనపచడానికి, ఆయన వాక్యానికి లోబడటానికి మరియు ఆయన సిద్ధాంతాల ప్రకారం జీవించడానికి ఒక తీర్మానం. ఈ నిబంధన మనలను ఐహిక భోగాల ప్రభావం నుండి కాపాడుతుంది మరియు మన పునాదిని దృఢంగా ఉంచుతుంది.
సిద్ధాంతపరంగా దీనిని మన జీవితాలకు అన్వయించుకుందాం. మనకు సంపూర్ణ మాదిరి అయిన యేసుక్రీస్తు, దేవుని చిత్తం నుండి తనను ఏదీ దూరం చేయనివ్వలేదు. ఆయన తన పరిచర్యను ప్రారంభించకముందు ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు మరియు లేఖనాలను అధ్యయనం చేశారు. శిష్యులు కూడా అదే చేశారు. పెంతెకోస్తు పండుగనాడు వారు పరిశుద్ధాత్మతో నింపబడకముందు, మేడగదిలో ప్రార్థనలో మరియు లేఖన ధ్యానంలో తమను తాము సమర్పించుకున్నారు. వారి పునాది విధేయత మరియు దేవుని వాక్యం (లేఖనాల) మీద ఆధారపడి ఉన్నందున అది చాలా దృఢంగా ఉంది.
కాబట్టి, ఈ రోజు మన ముందు ఉన్న సవాలు ఇదే: క్రైస్తవులుగా మనం యేసుక్రీస్తును అంగీకరించాము, లోక సంబంధమైన మార్గాలను విడిచిపెట్టాము మరియు ఒక నూతన జీవితాన్ని స్వీకరించాము. అయితే ప్రశ్న ఏమిటంటే: మనం దేవుడిని మహిమ పరిచే ఎంపికలు చేస్తామా, లేక తప్పుడు ప్రభావాలతో కూర్చుని, తప్పుడు సుఖాలను వెంబడించి, ఇహలోక ఆచారాలతో మన నిర్ణయాలను ప్రభావితం చేయనిస్తామా? మిమ్మును మీరే ప్రశ్నించుకోండి:
- ఈ ఆలోచన, ఈ క్రియ, లేదా ఈ సంబంధం దేవుని వాక్యం (లేఖనాల) మీద ఆధారపడి ఉందా?
- దీనిని యేసుక్రీస్తు ఆమోదిస్తారా?
- ఇది మన పరిశుద్దుడు మరియు నీతిమంతుడైన దేవుని దృష్టికి ప్రియముగా వున్నదా?
సంఘుమా, పరిశుద్దాత్మ మనలను బలపరుస్తుంది, కానీ ఆయన ఎన్నడూ మనం పాటించాల్సిన ‘విధేయత’కు ప్రత్యామ్నాయం కాదు. విధేయత అనేది మన వ్యక్తిగత ఇష్టం అయినప్పటికీ, అది తప్పనిసరి. విధేయత మరియు క్రమశిక్షణల ద్వారానే మనకు సామర్థ్యం/శక్తి చేకూరుతుంది. దేవుని వాక్కు పై మన జీవితాలను నిర్మించబడినప్పుడు, మన పునాదులు స్థిరముగా వున్నపుడు, మరియు లేఖనముల ద్వారా పరిశుద్ధాత్మ మనలను నడిపించుటకు అనుమతించినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. ఈ విధంగానే మనం రూపాంతరమును, స్వతంత్రమును మరియు నిత్య సంతృప్తిని పొందుతాము .
కాబట్టి ఈ రోజు, మనం దేవుని వాక్యములో వేరు పారియుండుటకు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుటకు మరియు క్షణికమైన ఇహలోక ఆశలకు దూరంగా ఉండుటకు ఒకరినొకరు ప్రొత్సహించుకొందాం. సమ్సోను కథ మనకు ఒక హెచ్చరిక కావాలి. సరియైన పునాది మరియు నిర్ణయాలు లేని గొప్ప శక్తి పతనము వైపు నడిపిస్తుంది. కానీ విధేయత, ప్రార్ధన, వాక్యము మరియు దైవిక సహవాసంతో కూడిన శక్తి మాత్రమే ‘రాజుల రాజు’ యొక్క బిడ్డలుగా మనకు నిజమైన విజయాన్ని అందిస్తుంది.
నేటి ధ్యానం :
నిజమైన శక్తి మరియు విజయం దేవుని వాక్యంలో వేరుపారి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం నుండే లభిస్తాయని ఈ రోజు నేను గుర్తుచేసుకుంటున్నాను. యేసు తన పరిచర్యను ప్రారంభించడానికి ముందు ఏ విధంగానైతే ప్రార్థించి, ఉపవసించి, లేఖనాలను ధ్యానించారో, అలాగే బలమైన పునాదిని నిర్మించుకోవడానికి నేను కూడా దేవునితో గడిపే సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా ఆలోచనలు, పనులు మరియు సంబంధాలు దేవునిని గౌరవిస్తున్నాయా మరియు ఆయన వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా అని నేను తప్పకుండా పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ నన్ను బలపరుస్తుంది, కానీ విధేయత చూపడం మరియు దేవుని చిత్తాన్ని ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకోవడం నా బాధ్యత. దైవిక పునాది లేని గొప్ప సామర్థ్యం పతనానికి దారితీస్తుందని సంసోను కథ నన్ను హెచ్చరిస్తోంది. ప్రతిరోజూ లేఖనాలను అన్వేషించడం, ప్రార్థన మరియు దైవిక సహవాసం ద్వారా నేను నిజమైన పరివర్తనను మరియు స్వతంత్రమును అనుభవించగలను. ఈ రోజు, నేను దేవుని వాక్యంలో వేరుపారి ఉండాలని, పరిశుద్ధాత్మ నన్ను నడిపించడానికి అనుమతించాలని మరియు క్షణికమైన ఇహలోక ఆనందాలను ఎదిరించాలని నిర్ణయించుకుంటున్నాను.
ప్రార్థన :
మా పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామములో మీ ముందుకు వస్తున్నాను. వాక్యమును బట్టి, యేసు క్రీస్తు రక్తమును బట్టి మరియు పరిశుద్ధాత్మ ఇచ్చే ఆధరణను బట్టి మీకు వందనాలు. ప్రభువా, నీ స్వరూపంలో నన్ను సృష్టించావు. నేను మీ స్వరూపంలో జీవించడానికి, మీకు మరింత దగ్గరవ్వడానికి మరియు చీకటిలో నడుస్తున్న వారికి వెలుగుగా ఉండటానికి నాకు సహాయం చేయండి. అనేక మార్లు, నీవు నాకు ఇచ్చిన వాటి విలువను నేను గ్రహించలేకపోయాను. తప్పిపోయిన కుమారుని వలె, నిత్యమైన వాటిని విడిచి తాత్కాలికమైన వాటి కోసం ప్రాకులాడాను. దేవా, నీవు ఇచ్చిన వరాలను (బహుమానములను) అమూల్యమైనవిగా భావించనందుకు నన్ను క్షమించుము. నీ బిడ్డ అని పిలవబడటానికి నాకు అర్హత లేదని నాకు తెలుసు, అందుకే నన్ను నేను మీకు ఒక బానిసగా సమర్పించుకుంటున్నాను. నా జీవితాంతం విశ్వసనీయతతో మిమ్మును సేవిస్తూ, యేసుక్రీస్తు ద్వారా మీకు ఇష్టమైన కార్యములను మాత్రమే చేసేలా నన్ను దీవించుము.ప్రభువైన దేవా, నన్ను పరిశీలించుము. నాలో ఏదైనా దోషమున్నదేమో చూడుము. మీ త్రోవలలో నన్ను నడిపించండి – యేసుక్రీస్తు యెక్క నిత్యమైన విధానాలలో నడిపించండి. ప్రభువా, నా కన్నీళ్లను, నా హృదయాన్ని మరియు నా సంపూర్ణ సమర్పణను అంగీకరించుము. నన్ను పరిశుద్ధ పరచము, బలపరచుము మరియు నీ మహిమ కోసం నన్ను ఒక సాధనముగా మలచుము. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్
ఈ వారపు సందేశం :
నిజమైన బలము దేవుని వాక్యమందు వేరుపారుట ద్వారా మరియు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా లభిస్తుంది. దేవునిని మహిమపరిచే నిర్ణయాలు తీసుకోవడానికి విధేయత, ప్రార్థన మరియు దైవిక సహవాసం ఎంతో అవసరం. బలమైన పునాది లేకపోతే ఎంతటి గొప్ప సామర్థ్యమైనా పతనానికి దారితీయవచ్చు, కానీ ఆ పునాది ఉన్నప్పుడు మాత్రమే మనం నిజమైన విజయాన్ని మరియు పరివర్తనను అనుభవిస్తాము
(అనుదిన ఆధ్యాత్మిక పరివర్తన, రచయిత. రెవరెండ్. ఇమ్మానువేల్ అరుల్ పాల్. హియర్ మేత్త్యూ 11:28 మినిస్ట్రీస్ తరుపున. ముద్రణ జనవరి. 17, 2026. తర్జుమా సహోదరి:జలజాక్షి).
ప్రకటనలు :
- మీ శీషత్వపు ప్రయాణములో సహకారము కోరినట్లు అయితే ప్రతి శుక్రవారం రాత్రి 8:30 గంటలకు (IST) జరిగే మా వారంతపు శిష్యత్వ సమావేశాలలో చేరవలసిందిగా మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
Link:https://us06web.zoom.us/j/81144235750?pwd=EsfuED6du4T8YMjFdSXdpvWuPXpCOW.1
(Meeting ID: 811 4423 5750. Passcode: 12345).
- వ్యక్తిగత కౌన్సెలింగ్ కోరినట్లు అయితే, అపాయింట్మెంట్ కొరకు ఈ లింక్ ను వాడండి. https://scheduler.zoom.us/rev-immanuel-paul/appointment
- మా పరిచర్యలు (ministries) మరియు సమావేశాల గురించిన తాజా సమాచారం మరియు వార్తలు తెలుసుకోవడానికి, మా వాట్సాప్ (WhatsApp) గ్రూప్‌లో చేరవలసిందిగా మీకు స్వాగతం పలుకుతున్నాము. https://chat.whatsapp.com/EokMFGuZdgb23Sg8BsHzas
విశ్వాసములో మరియు సహవాసములో మీతో నడువుటకు మేము ఎదురుచూస్తుంటాం.
Click here to download as PDF -> Telugu